Wednesday 2 August 2017


చూడామణి గ్రహణం
డా|| శంకరమంచి రామకృష్ణ శాస్త్రి
గ్రహణ సమయంలో స్నానం, దానం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది.
ఆసమయంలోచేసిన మంత్రపునశ్చరణకు కోటిరెట్లు ఫలితం లభిస్తుంది.
సూర్య సిద్దాంతం వేలసంవత్సరాలకు పూర్వమే గ్రహసంచారం గ్రహణ గణితాలను శాస్త్రీయంగా వివరించింది.
సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ మూడూ ఒకే సరళరేఖపైకి వస్తే గ్రహణం సంభవిస్తుంది. పూర్ణిమ అంత్య సమయం, పాడ్యమి ప్రారంభ సంధిలో చంద్రగ్రహణం పడుతుంది. ఈసారి శ్రావణ పౌర్ణమినాడు పాక్షిక చంద్రగ్రహణ వేళకు చంద్రుడు మకరంలో, కేతువు కుంభంలో ఉంటారు. సాధారణంగా చంద్రగ్రహణ సమయంలో చంద్రకేతువులు కానీ, చంద్రరాహువులు కానీ ఒకే రాశిలో ఉంటారు. ఈసారి రాశి సంధుల్లో గ్రహణం రావడం వల్ల చంద్ర కేతువులు వేర్వేరు రాశుల్లో ఉన్నారు. అలాగే సూర్యుడు కర్కాటకంలో, రాహువు సింహంలో ఉన్నారు. ఇలా సంధికాలంలో ఏర్పడే గ్రహణాలకు దోషం తక్కువ. శుభఫలితాలేఉన్నాయి.

ఇది ప్రత్యేకం :
రవిగ్రహః సూర్యవారే సోమేసోమగ్రహస్తథా |
చూడామణిరితిఖ్యాతః తత్రదత్తమనంతకం ||
ఆదివారంనాడు సూర్యగ్రహణం, సోమవారంనాడు చంద్రగ్రహణం వస్తే వాటిని చూడామణి గ్రహణాలంటారు. చూడామణి గ్రహణ సమయంలో ఏ దానం చేసినా అనంతమైన ఫలితాన్ని కలిగిస్తుంది. చంద్ర గ్రహణం అర్థరాత్రి సమయంలో పడుతున్నందున ఆ రోజు పగలు నిర్వహించే పితృకార్యాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పగలు రెండు గంటలలోపు శ్రాద్దాది పితృకర్మలు ఆచరించవచ్చు. రాత్రి ఆహారం 9 గంటల లోపు తీసుకోవాలి. మంత్రానుష్ఠానం చేసేవారికి రాత్రిపూట ఆహారం తీసుకోవడం నిషిద్ధం.

గ్రహణ ఫలితాలు:
గ్రహణ గోచారంలో మన జన్న రాశి నుండి 3, 6, 10, 11 రాశుల్లో గ్రహణం పడితే మంచిది. ఈ గ్రహణం మకరంలో పడుతోంది.
కాబట్టి వృశ్చిక, సింహ, మేష, మీన రాశుల వారికి శుభప్రదం.
ధనస్సు కన్య, కర్కాటకం, వృషభ రాశుల వారికి మధ్యమ ఫలం అందచేస్తుంది.
మకర, తుల, మిథునం, కుంభరాశులవారికి అధమ ఫలం ఉంటుంది.
మకరరాశివారు, ప్రధానంగా శ్రవణా నక్షత్రంవారు గ్రహణ శాంతి చేసుకోవాలి. వీరు గ్రహణం చూడకూడదు.

స్నానం – సంకల్పం:
రాశులతో సంబంధం లేకుండాఅందరికీ గ్రహణదోషం ఉంటుంది. గ్రహణ సమయంలో రాహుదర్శనం అవుతుంది. దీనిని సూతకంతో సమానం అని పెద్దలు చెప్పారు. అందుకే అందరూ గ్రహణస్నానం చేయాలి. గ్రహణ ప్రారంభంలో స్నానం చెయ్యాలి, గ్రహణ మధ్యకాలంలో హోమం చెయ్యాలి, దేవతార్చన శుభప్రదం, గ్రహణం విడిచే సమయంలో దానం చేసుకోవాలి.
గ్రహణం పూర్తి అయిన తరువాత స్నానం చెయ్యాలి. నదీ స్నానం ఉత్తమం. గ్రహణ సానాన్ని శరీరంపై ఏ వస్త్రం ఉందో దానితోనే చేయాలి. గ్రహణం ప్రారంభంలో చేసే స్నానం కంటే విడుపు స్నానం గొప్పది. దీన్నే ముక్తి స్నానమని కూడా అంటారు. వివాహితులైన స్త్రీలు కంఠస్నానం చెయ్యాలి. పిల్లలు, వృద్ధులు శిరస్నానం చెయ్యొచ్చు. పరుషులు తప్పనిసరిగా శిరస్నానం చెయ్యాలి. సూతకంలో ఉన్నా స్నానం చేయడం తప్పనిసరి. స్త్రీ రజస్వలా దోషంలో ఉన్నా గ్రహణస్నానం చెయ్యాలి.
గ్రహణ స్నానం మంత్రపూర్వకంగా చేయనక్కరలేదు.
సంకల్పం: స్పర్శ సమయంలో మమ . గోత్రస్య. నామధేయస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం చంద్రగ్రహణ కాలే గ్రహణస్పర స్నాన ప్రయుక్త శ్రేయః ప్రాప్త్యర్థం స్పర్శస్నానం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి. అలాగే మోక్షస్నానం కూడా చేయాలి. గ్రహణ మోక్షస్నాన ప్రయుక్త శ్రేయః ప్రాప్త్యర్థం చంద్రగ్రహణ మోక్షస్నానం కరిష్యే అని సంకల్పం చెప్చుకుని స్నేనం చేయాలి. గ్రహణం విడిచిన తరువాత చంద్రబింబాన్ని దర్శించి నమస్కరించాలి.
విశిష్టం.... గ్రహణదానం:
 సర్వం గంగాసమం తోయం సర్వే వ్యాససమా ద్విజాః |
సర్వం భూమి సమం దానం గ్రహణే చంద్ర సూర్యయోః ||
 గ్రహణ సమయంలో సర్వజలమూ గంగతో సమానమవుతాయి. సర్వద్విజులూ వ్యాసమహర్షితో సమానులైన గురువులు అవుతారు. ఈ సమయంలో చేసే సర్వదానాలూ భూదానంతో సమానమైన ఫలితాలనిస్తాయి. ఇవి సూర్యచంద్ర గ్రహణాలు రెండింటికీ వర్తిస్తాయి. గ్రహణ వేళ సాధారణంగా బింబదానం చేస్తారు.

దీక్షా సమయం:
గ్రహణ కాలంలో మంత్ర పురశ్చరణ తప్పక చేయాలి. గ్రహణ సమయంలో దీక్షగానీ, మంత్రోపదేశంకానీ తీసుకుంటే విశేషమైన ఫలం లభిస్తుంది. గ్రహణ కాలంలో జపంచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గ్రహణం మొదలైన దగ్గరనుంచీ విడిచే వరకూ మంత్రాన్ని జపం చేసుకోవాలి. కలియుగ ప్రభువైన వేంకటేశ్వరుని నక్షత్రంలో గ్రహణం సంభవిస్తోంది. కాబట్టి స్వామి వారి దివ్య నామాన్నివిశేషంగా జపించుకుంటూ ఉంటే దోషం తొలగి పుణ్యం లభిస్తుంది.

శుభకార్య నిర్వహణ:
 చంద్రగ్రహణంలో శుద్ధ ద్వాదశి నుండి బహుళ తదియ వరకూ శుభ కార్యాలేవీ చేయకూడదు. ఈసారి వస్తున్నది పాక్షిక గ్రహణమే. ఈ గ్రహణానికి ముందు ఒకరోజు, తరువాత ఒకరోజు అంటే గ్రహణంతో కలిపి మూడురోజుల పాటు శుభకార్యాలను నిర్వహించకూడదు.
పాక్షిక చంద్రగ్రహణం
7.8-2017
గ్రహణ నిడివి: 1గంట 55 నిమిషాలు
గ్రహణ ప్రారంభం : రాత్రి గం.10:53 ని.లు.
గ్రహణ మధ్యకాలం : రాత్రి గం.11.50 ని.లు.
గ్రహణ అంత్యకాలం : రాత్రి గం.12. 48 ని.లు. (8-8-2o17)
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీహేమలంబి సంవత్సర శ్రావణ శుద్ధ పూర్ణిమ సోమవారం శ్రవణా నక్షత్రయుక్త మకరరాశిలో చూడామణి అర్థాల్పగ్రాస పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.


అరుదైన సూర్యగ్రహణం
ఆగస్టు 21వ తేదీన అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతోంది. 1979వ సంవత్సరం తరువాత మళ్లీ అంతటి శక్తివంతమైన సూర్యగ్రహణం ఈ సంవత్సరం ఏర్పడనుంది. గ్రహణ వేళలను లెక్కించేపద్ధతి చాలా క్లిష్టంగా ఉంటుంది. గ్రహణ గణితంలో రాహుకేతువులు కీలకం. అయితే వీరిద్దరూ ఆకాశంలో ప్రత్యక్షంగా కనిపించరు. ఆంగ్లంలో వీటిని నోడ్స్ అంటారు. నోడ్ అంటే ఈక్వేటర్. ఎక్లిప్టిక్ లు కలిసే స్థానం. అనగా భూ కక్ష్యా వృత్తం సూర్యకక్ష్యతో అనుసంధానించే స్థానం. భూకక్ష్యలో అంబ్ర, పెనంబ్ర అనే చీకటి నీడలుంటాయి. ఈ మార్గాల్లోకి భూమి రావడమే గ్రహాణం. ఈ నీడల్లో అంబ్రాఅనేది చిక్కటి నీడ కాగా, పెనంబ్రా అనేది క్రీనీడ, అటువంటి చిక్కటి చీకటి నీడలో భూమి అత్యధిక సమయం ఉండే పరిస్థితి సంపూర్ణ సూర్యగ్రహణంలో కానవస్తుంది. ఇది అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9.05 నిమిషాలకు ప్రారంభమై వివిధ ప్రాంతాలమీదుగా 2.48 వరకు కొనసాగబోతోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సంపూర్ణంగానూ యూరప్, ఆఫ్రికా దేశాల్లో పాక్షికంగానూ ఈ గ్రహణం కనబడనుంది. ఈ సంవత్సరం తరువాత మళ్లీ క్రీ.శ.2522 వరకు ఇటువంటిగ్రహణం చూడడం స్తాధ్యం కాదు. అంతరిక్ష పరిశోధనా కేంద్రం 'నాసా ఈ గ్రహణంపై విస్తృత స్థాయిలో పరిశోధనలు నిర్వహిస్తోంది. సూర్యగ్రహణ నిడివి 7నిమిషాలు.
సింహరాశిలో మఖ నక్షత్ర యుక్తమైన రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడబోతోంది.అమెరికాలో మఖ నక్షత్రం వారు, సింహరాశివారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంల్లో కనిపించదు. ఎటువంటిగ్రహణ నియమాలనూ పాటించనవసరం లేదు,


No comments:

Post a Comment

  आमुख मन्त्रेश्वर कृत फलदीपिका जातक ग्रन्थों की शृङ्खला की एक अनुपम कड़ी है। यह ग्रन्थ अपने मूल रूप में प्राचीन भारतीय लिपि ' ग्रन्थ ...